: మోదీ ఇలాకాలో సాధువులపై విరిగిన లాఠీ... గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో సాధువులపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలతో కుళ్లబొడిచారు. నిన్న రాత్రి గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీచార్జీపై ప్రస్తుతం వారణాసిలో సాధువులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. లాఠీచార్జీ జరిపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందంటే... గంగానదిలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గణేశ్ ప్రతిమలను నదిలో నిమజ్జనం చేయడంపై కోర్టు నిషేధం విధించింది. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోని కొంతమంది స్థానికులు సాధువులతో కలిసి వినాయక నిమజ్జనానికి గంగానదికి బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గంగానదిలో నిమజ్జనం కుదరదన్న పోలీసుల హెచ్చరికలను సాధువులు లెక్కచేయలేదని సమాచారం. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. దీంతో సాధువులు పరుగులుపెట్టారు. ఈ అంశం దేశవ్యాప్తంగా పెను కలకలం రేపే అవకాశాలున్నాయి.