: 'మోదీ ఫెయిల్ డాట్ కాం'ను ప్రారంభించిన అమెరికన్ ఎన్నారైలు
నాడు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టిన ప్రవాస భారతీయులు నేడు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు మోదీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి ఎన్నారైలలో కొందరు 'మోదీ ఫెయిల్ డాట్ కాం' పేరిట కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీనికి ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తుండటంతో, ఈ వెబ్ సైట్ వీక్షకుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలు, దళితులు, మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నది వారు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పౌర హక్కులను మోదీ హరిస్తున్నారని, సాంస్కృతిక సంస్థల్లో మత ఛాందస రాజకీయాలు చొచ్చుకుపోతున్నాయని కూడా వారు ఆరోపిస్తున్నారు. యూఎస్ లో ఉన్న భారతీయుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇంతవరకూ ఒక్క చర్య కూడా తీసుకోలేదని వారు గుర్తు చేశారు.