: ఒకే హోటల్ లో భారత్, పాక్ ప్రధానుల బస... మరి మాట కలుస్తుందా?
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఈ వారంలోనే జరగనున్నాయి. ఈ సమావేశాలకు సభ్య దేశాల ప్రభుత్వాధినేతలంతా దాదాపుగా హాజరవుతారు. ఐరాసలో భారత్, పాకిస్థాన్ లు కూడా సభ్య దేశాలుగా ఉన్నందున ఈ రెండు దేశాల ప్రధానుల హోదాలో నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు కూడా ఈ సమావేశాల కోసం ఈ వారంలో అమెరికాకు వెళుతున్నారు. ఇందులో కొత్తేమీ లేదు కదా అని అనుకుంటున్నారా? కొత్త లేకపోతే, వార్తేముంది చెప్పండి. శత్రు దేశాలుగా వ్యవహరిస్తున్న ఈ రెండు దేశాల ప్రధానులు అమెరికా నగరం న్యూయార్క్ లో ఒకే హోటల్ లో బస చేయబోతున్నారు. బుధవారం సాయంత్రానికి న్యూయార్క్ చేరుకోనున్న నరేంద్ర మోదీ నగరంలోని వాల్దార్ఫ్ ఆస్టోరియా హోటల్ లో బస చేయనున్నారు. ఇక ఈ నెల 25న న్యూయార్క్ చేరుకోనున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా నేరుగా మోదీ బస చేయనున్న వాల్డార్ఫ్ ఆస్టోరియా హోటల్ కే వెళతారు. ఒకే హోటల్ లో బస చేస్తున్నప్పటికీ వీరిద్దరి మధ్య భేటీకి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదు. అయితే ఒకవేళ అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడితేనైనా వీరి మధ్య మాట కలుస్తుందా? అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.