: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం... అర్ధరాత్రి కోల్ కతాలో అత్యవసర ల్యాండింగ్
ఎయిరిండియాను అకస్మాత్తుగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. నిన్న ఢిల్లీ నుంచి హాంగ్ కాంగ్ కు 216 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. గాల్లో ఉండగానే విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సకాలంలో గుర్తించిన పైలట్ ఎలాంటి ప్రమాదం సంభవించకముందే అప్రమత్తమయ్యాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని నిన్న అర్ధరాత్రి కోల్ కతా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించినా, ఎయిరిండియా మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సదరు విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని తక్షణమే సరిదిద్దడమో, లేక వేరే విమానాన్ని ఏర్పాటు చేయడమో చేయలేదు. దీంతో హాంగ్ కాంగ్ కని బయలుదేరిన ప్రయాణికులు కోల్ కతా ఎయిర్ పోర్టులో పడిగాపులు కాశారు. ఎయిరిండియా నిర్లక్ష్య వైఖరిపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు.