: నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ కాంట్రాక్ట్ కోసం తీవ్రపోటీ!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో రాజధాని నిర్మాణానికి అవసరమైన 30 వేల ఎకరాలకు పైగా భూమిని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. సింగపూర్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను కూడా సిద్ధం చేసింది. వచ్చే నెల విజయదశమి సందర్భంగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా జపాన్, సింగపూర్ ప్రధానులు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగపూర్ ప్రధానికి చంద్రబాబు నేడు ఆహ్వాన పత్రికను అందించనున్నారు. ఇక అమరావతి నిర్మాణ పనులను దక్కించుకునేందుకు సింగపూర్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు అసెండాస్, సెంబ్ కార్ప్ లు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు రెండు కంపెనీలు తమ తమ స్థాయిలో యత్నాలను ముమ్మరం చేశాయి. కాంట్రాక్టు దక్కించుకునే కంపెనీ 375 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు 275 ఎకరాల్లో సరికొత్త హంగులతో ఏర్పాటు కానున్న ఐకానిక్ టవర్స్ నిర్మాణాన్ని చేపట్టనుంది.