: సోలార్ మొబైల్ నెట్ వర్క్...పాక్ శాస్త్రవేత్తల ఘనత
పాకిస్థాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణ చేశారు. ప్రకృతి విపత్తుల్లో కమ్యూనికేషన్ లో తీవ్ర అంతరాయాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు దానికి సరికొత్త పరిష్కారం కనుగొన్నారు. సోలార్ మొబైల్ నెట్ వర్క్ ను రూపొందించారు. లాహోర్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు, అమెరికాకి చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధక బృందంతో కలిసి పాకిస్థాన్ కోసం రెస్క్యూ బేస్ స్టేషన్ (ఆర్బీఎస్)ను రూపొందించారు. సాధారణ సెల్ ఫోన్లలో కూడా ఉపయోగించుకోగలిగే మొట్టమొదటి అత్యవసర టెలికామ్ సిస్టమ్ ఇది అని శాస్త్రవేత్తలు తెలిపారు. విపత్తు సమయాల్లో కమ్యూనికేషన్లు పని చేయవు. అలాంటి సందర్భాల్లో ఆర్బీఎస్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సాధారణ మొబైల్ లో కూడా సిగ్నల్స్ వచ్చేస్తాయి. వీటితో కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని వారు వెల్లడించారు. ఆర్బీఎస్ తక్కువ బరువుతో ఉండే బాక్స్ అని, దీనిలో సిగ్నల్ యాంప్లిఫైర్, యాంటెన్నా, బ్యాటరీ ఉంటాయని వారు వెల్లడించారు. బ్యాటరీ రీఛార్జ్ కావడానికి సోలార్ ప్యానెల్ ఉంటుందని వారు తెలిపారు. దీనిని వెల్లడానికి క్లిష్టమైన ప్రాంతాల్లో హెలీకాప్టర్ సాయంతో జారవిడచవచ్చని వారు పేర్కొన్నారు. విపత్తు సమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు వివరించారు.