: 'దొంగ' ప్రసవాలతో దొరికిపోయిన నర్సు!


డబ్బు సంపాదించడానికి మార్గాలు అనేకం. వక్రమార్గంలో డబ్బు సంపాదించడానికి లెక్కలేనన్ని మార్గాలు. అయితే, ఊహకందని అడ్డదారిలో డబ్బు సంపాదించడం మాత్రం ఆ నర్సుకే తెలుసు. ఆ కథేమిటంటే.. అస్సాంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమె పేరు లిల్లీ బేగమ్ లస్కర్. సుఖ ప్రసవం, బిడ్డ సంరక్షణలను ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ సెంటర్లలో ప్రసవించే మహిళలకు ప్రభుత్వం తరపున రూ.500 యిస్తారు. ఇదిగో..ఈ పాయింటే పట్టుకుంది లిల్లీ. తన బుర్రకు వక్రంగా పదునుపెట్టింది. డబ్బులు సంపాదించాలనుకుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, లిల్లీ బేగమ్ నర్సుగా పనిచేస్తున్న హెల్త్ సెంటర్ లో ప్రసవించిన మహిళలకు డబ్బులిచ్చే బాధ్యత కూడా ఆమెదే. అందుకే, అందొచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకుంది. సుమారు 80 సార్లు ప్రసవించిన మహిళల జాబితాలో రకరకాల పేర్లు రాసుకుని ఆ డబ్బులను ఆమె పర్స్ లో వేసుకునేది. ఇట్లా వెయ్యో, రెండు వేలో కాదు ఏకంగా రూ.40,000 నొక్కేసింది. ఎంత మంచి చేసినా.. ఎంత చెడ్డ పని చేసినా బయటపడకుండా ఉంటుందా? ఉండదు కదా! అందుకే పై అధికారులకు ఓ ఆకాశరామన్న ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగి దొంగ గర్భవతిని ఉద్యోగంలో నుంచి పక్కనబెట్టామని కరీంగంజ్ జిల్లాలోని రూరల్ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక వైద్యాధికారి చెప్పారు. అయితే, ఈ పాడు పని ఎందుకు చేశావని ఆమెను విలేకరులు ప్రశ్నిస్తే ..‘నర్సులుగా పనిచేసే వాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. నిజాయతీగా తాము ఎంత పనిచేసినా దానికి తగ్గ డబ్బులు మాకు రావు. అందుకే దొంగ గర్భాలు దాల్చాను. తప్పు చేశాను. నన్నుక్షమించండి’ అని లిల్లీ బేగం వేడుకుంటోంది.

  • Loading...

More Telugu News