: వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట!... కాంగ్రెస్ పై బాల్క సుమన్ సెటైర్లు
పూర్వ రంగంలో ఓయూ విద్యార్థి జేఏసీ నేతగా, ఆ తర్వాత టీఆర్ఎస్ నేతగా మారి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన బాల్క సుమన్ వాగ్బాణాలు సంధించడంలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ గళం విప్పింది. మాజీ మంత్రులు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు వర్సిటీని సందర్శించి టీఆర్ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఆరోపణలపై బాల్క సుమన్ కొద్దిసేపటి క్రితం ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఓయూ విద్యార్థులను లాఠీలతో కొట్టించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వారి సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా కాంగ్రెస్ నేతల వైఖరి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ నేతలు కూడా అనవసర రాద్ధాంతం చేస్తూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.