: చంద్రబాబుపై రోజా ఘాటు విమర్శ...ఏపీ ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపణ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మరోమారు ఘాటు విమర్శలు చేశారు. కొద్దిసేపటి క్రితం గుంటూరు వచ్చిన రోజా ఈ నెల 26న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్ష కోసం ఎంపిక చేసిన దీక్షా స్థలిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఫైరయ్యారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారన్నారు. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఒత్తిడి చేయలేకపోతున్నారని ఆమె ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని రోజా విమర్శించారు.