: బీసీసీఐ బాస్ ఎవరో?... అందరి కళ్లూ అనురాగ్ ఠాకూర్ వైపే!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణంతో క్రికెట్ వర్గాలు నివ్వెరపోయాయి. బీసీసీఐ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అంతేకాక భారీ కుదుపునకు కూడా బీసీసీఐ గురి కానుంది. ఎందుకంటే, ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐకి ఆర్థిక జవసత్వాలు అందించడమే కాక ఆ సంస్థను ప్రపంచంలోనే ధనిక బోర్డుగా మలచడంలో దాల్మియాదే కీలక భూమిక. సుదీర్ఘ అనుభవం ఉన్న దాల్మియా నిన్న తుది శ్వాస విడిచారు. మరి బోర్డు పగ్గాలు చేపట్టేదెవరు? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బోర్డు చైర్మన్ లేని సమయంలో బోర్డు కార్యదర్శిదే క్రియాశీలక భూమిక. అంతేకాక అధ్యక్ష పదవి ఖాళీ అయిన 15 రోజుల్లోగా బోర్డును సమావేశపరచి, కొత్త అధ్యక్షుడి ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సింది కూడా కార్యదర్శే. దీంతో ప్రస్తుతం కార్యదర్శి పదవిలో ఉన్న లోక్ సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ తీసుకునే నిర్ణయంపై క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నిబంధనల మేరకు ఠాకూర్ సమావేశం ఏర్పాటు చేస్తారా? లేక సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, తానే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఠాకూర్ పావులు కదిపే అవకాశాలు లేకపోలేదన్న వాదనా వినిపిస్తోంది. ప్రస్తుతం బోర్డులో ఉన్న వాతారణం ఠాకూర్ ఎన్నికకు అనుకూలంగానే ఉందన్న విశ్లేషణలు వినవస్తున్నాయి. ఠాకూర్ తో పాటు అధ్యక్ష పదవి రేసులో అందరికన్నా ముందు వరుసలో రాజీవ్ శుక్లా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ కాంగ్రెస్ నేతకు ఈశాన్య రాష్ట్రాల బోర్డుల మద్దతు లభించాల్సి ఉంది. ఇక గ్వాలియర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతం రాయ్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ ఆయనకు బీసీసీఐలో మెజారిటీ మద్దతు లేదు. ఢిల్లీ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సీకే ఖన్నా పరిస్థితి కూడా అలానే ఉంది. దీంతో ఠాకూర్ కే చైర్మన్ పదవి లభించడం ఖాయమని తెలుస్తోంది.