: బీహార్ లో బీజేపీకి మరో షాక్... 150 స్థానాలకు పోటీ చేస్తున్న శివసేన


బీహార్ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో కార్యరంగంలోకి దూకిన గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ వచ్చే వారం బీహార్ లో నాలుగు ర్యాలీలు చేపడుతున్నారు. ఈ ర్యాలీలతో బీజేపీ ఓట్ల శాతానికి గండిపడటం ఖాయమేనని విశ్లేషణలు సాగుతున్నాయి. తాజాగా బీజేపీ మిత్రపక్షం, ఎన్డీఏ భాగస్వామి శివసేన సొంతంగా బీహార్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన శివసేన, ఆ పార్టీకి అధికారం చేజిక్కడంలో రోజుల తరబడి సస్పెన్స్ కొనసాగేలా చేసింది. ఒకానొక సమయంలో బీజేపీ, శివసేనలు దాదాపుగా వైరి పక్షాలుగా మారే పరిస్థితీ వచ్చింది. అయితే 25 ఏళ్లుగా సాగుతూ వస్తున్న మైత్రిని కొనసాగించేందుకే ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక బీహార్ లో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు బీహార్ వెళ్లిన ఆయన బీహారీలు అడగకున్నా, రూ.1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ జోరుగా ప్రచారం సాగిస్తోంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయనగా శివసేన నిన్న బీజేపీకి షాకిచ్చే ప్రకటన చేసింది. బీహార్ లో 150 సీట్లకు ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటించారు. బీహార్ లో అంతగా ఓటు బ్యాంకు లేని శివసేన, 150 స్థానాల్లో పోటీ చేసి సాధించేదేమిటంటూ బీజేపీ నేతలు లోలోపలే రగిలిపోతున్నారు. మిత్రపక్షం వేరుగా బరిలోకి దిగితే తన ఓటు బ్యాంకుకే గండి పడుతుంది కదా అన్న కోణంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News