: ఉరేసుకుని ఒకరు...పురుగులమందు తాగి మరొకరు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైన మరో రైతు హైదరాబాద్ లోని బేేగంపేట పంప్ హౌస్ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్షాలు లేక వ్యవసాయం సాగకపోవడంతో చేసిన అప్పులు, కూతురు వివాహం కోసం చేసిన అప్పులను తీర్చే మార్గం లేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా రాంసాగర్ కు చెందిన మల్లేష్ కు అక్కడ కొంత వ్యవసాయ భూమి ఉంది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట పండటం కనాకష్టమైంది. దీంతో కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చాడు. ఇక్కడున్న ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా మల్లేష్ పని చేశాడు. చేసిన అప్పులు తీర్చేంత ఆదాయం ఆ ఉద్యోగం ద్వారా రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు మరిన్ని పెరగడంతోనే మల్లేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని అతని బంధువులు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో సంఘటన.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఆరపల్లిలో రైతు కల్లూరి రాజయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్నసాగు చేశాడు. వర్షాలు లేక మొక్కజొన్న పంట ఎండిపోయింది. అంతకుముందు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పత్తి పంట నీటి పాలైంది. వ్యవసాయం కోసం చేసిన అప్పు రూ.4 లక్షలు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెందిన రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.