: సామాజిక మాధ్యమాల సెగ ఎస్సై ఉద్యోగం ఊడగొట్టింది
సోషల్ మీడియా సెగ ఓ ఎస్సైని తీవ్రంగా తాకి, అతని ఉద్యోగం ఊడగొట్టింది. ఉత్తరప్రదేశ్ లో లక్నోలోని జనరల్ పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై కృష్ణకుమార్ (65) అనే వ్యక్తి గత 35 ఏళ్లుగా టైప్ రైటర్ తో జీవనం సాగిస్తున్నాడు. కొద్ది కాలం క్రితం అక్కడికి వచ్చిన ఓ ఎస్సై అతనిని అక్కడ నుంచి ఖాళీ చేయాలని సూచించారు. 35 ఏళ్లుగా అదే ప్రాంతంలో పని చేసుకుంటూ బతుకీడుస్తున్న సదరు వ్యక్తికి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. దీంతో అక్కడి నుంచి కదలకుండా, తన పాత కాలం టైపు రైటర్ తో పని చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గత వారం అక్కడికి వచ్చిన ఎస్సై 'చెప్పిన మాట వినవా? ఖాళీ చేయమన్నాను కదా?' అంటూ బూతులందుకున్నాడు. 'రోజంతా పని చేసినా 50 రూపాయలు కూడా రావడం లేదు, ఎక్కడికైనా వెళ్తే ఆ డబ్బులు కూడా రావ'ని మొరపెట్టుకున్నాడా వృద్ధుడు. అయినా కనికరించని సదరు ఎస్సై అతనిని, అతని టైపు రైటర్ ని కాలితో తన్ని ముక్కలు చేశాడు. ఇంకోసారి కనబడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి వెళ్లాడు. ఈ తతంగాన్ని ఓ జర్నలిస్టు షూట్ చేసి, సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది యూపీ సీఎం వరకు వెళ్లడంతో తక్షణం ఎస్సైని సస్పెండ్ చేసి, ఆ వృద్ధునికి కొత్త టైప్ రైటర్ మిషన్ కొనివ్వాలని ఆదేశాలు జారీ చేశారు.