: ఆర్థిక శాఖ కార్యదర్శిపై హరీశ్ రావు కస్సుబుస్సు!


టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు పాలనపై మంచి పట్టున్న విషయం తెలిసిందే. ఈ విషయం అధికారులకు కూడా బాగానే తెలుసు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నిధులకేమీ కొరత లేదు. అయితే హరీశ్ రావు అడిగిన ప్రతి దానికి నిధులు లేవంటూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర చెబుతున్నారట. మొన్నటిదాకా మిన్నకుండిపోయిన హరీశ్ లో నిన్న మాత్రం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మిడ్ మానేరు రిజర్వాయర్ వల్ల ముంపునకు గురవుతున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గ్రామాలపై నిన్న మరో మంత్రి కేటీఆర్ తో కలిసి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సవరించిన పరిహారం చెల్లించాలంటే రూ.250 కోట్ల మేర నిధులు అదనంగా అవసరం అవుతాయి. దీంతో సదరు నిధులను మంజూరు చేయాలని హరీశ్ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్రకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థికపరమైన అంశం కావడంతో సీఎం నిర్ణయం లేనిదే నిధుల విడుదల సాధ్యం కాదని ప్రదీప్ చంద్ర చెప్పారట. దీంతో సహనం నశించిన హరీశ్ ‘‘మేం ఏదడిగినా నిధుల్లేవంటున్నారు. ఇలాగైతే ప్రాజక్టులు పూర్తి కావడం ఎలా?’’ అని ప్రదీప్ ను నిలదీశారట. ఈ విషయంలో సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నందున తానేమీ చేయలేనని కూడా ప్రదీప్ చేతులెత్తేశారట.

  • Loading...

More Telugu News