: ప్రధాని కార్యాలయ అధికారిగా నటించాడు... అరెస్ట్ అయ్యాడు
ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా నటిస్తూ... ఓ యువకుడు స్థానిక అధికారులను మోసం చేయడానికి యత్నించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన చండీఘడ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, చండీఘడ్ సమీపంలోని రాయ్ పూర్ ఖుర్ అనే గ్రామానికి చెందిన రాజ్ కేసర్వాని అనే యువకుడు చండీఘడ్ అడ్మినిస్ట్రేటర్ కు సలహాదారుగా పనిచేస్తున్న సుర్జిత్ సింగ్ అనే అధికారికి రెండు రోజుల క్రితం ఫోన్ చేశాడు. వ్యక్తిగతంగా ఓ పని చేయాలని చెప్పాడు. పని అయ్యాక మళ్లీ ఫోన్ చేస్తానని తెలిపాడు. అయితే, డౌట్ వచ్చిన సుర్జిత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు రాజ్ కేసర్వాని మోసం చేసినట్టు నిర్ధారించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు.