: రాముడు ఎప్పుడు పుట్టాడు? మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?...ఆ తేదీలు ఇవిగో!
శ్రీరామచంద్రుడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? మహాభారత యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందనుకుంటు న్నారు? అశోక వనంలో సీతను హనుమంతుడు ఎప్పుడు కలిశాడు?.. ఈ తేదీలు, సంవత్సరాలు, సమయం తెలుసుకోవడం సాధ్యమయ్యే పనేనా?. ఎవరివల్ల అయినా అవుతుందా? అంటే.. ఇప్పటి వరకు దేశ, విదేశీ చరిత్రకారులు ఎందరో కొంత మేరకు విజయం సాధించగలిగారు. కాకపోతే, అవే తేదీలని కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అయితే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చి మాత్రం ఆ తేదీలను కచ్చితంగా చెప్పగలమంటోంది. శ్రీరాముడు జన్మించింది క్రీస్తు పూర్వం 5114, జనవరి 10, 12.05 గంటలకు. మహాభారతయుద్ధం ప్రారంభమైన సంవత్సరం క్రీస్తు పూర్వం 3139, అక్టోబర్ 13. రావణుడు అపహరించుకుపోయిన సీతాదేవిని అశోకవనంలో హనుమంతుడు కలిసిందెప్పుడంటే..క్రీస్తు పూర్వం 5076, సెప్టెంబర్ 12వ తేదీన అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చి చెబుతోంది. ఈ విషయాలన్నింటిని ప్రస్తుతం జరుగుతున్న ‘యునిక్ ఎగ్జిబిషన్ ఆన్ కల్చరల్ కంటిన్యుటీ ఫ్రమ్ రుగ్వేద టు రోబోటిక్స్’లో పెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ మాట్లాడుతూ శ్రీరాముడు, మహాభారతం వంటి చారిత్రక అంశాలకు సంబంధించి ఈ ఎగ్జిబిషన్ లో ఉంచిన సమాచారాన్ని సేకరించి ఇందుకు సంబంధించిన వివరాలను ఇవ్వవలసిందిగా అధికారులకు సూచించారు. ఈ ఎగ్జిబిషన్ అందరి మన్ననలు పొందుతోందని, ప్రతిభకు పట్టంకట్టే ఎన్నో విషయాలను ఇక్కడ ఉన్నాయన్నారు.