: 14 సార్లు ర్యాష్ డ్రైవింగ్ కేసులు, ఆపబోయిన పోలీసులకు టోకరా, సినిమాను తలపించిన చేజింగ్!
హైదరాబాద్ పరిధిలోని ఎల్ బీ నగర్... రాత్రి 10 గంటల సమయం. పోలీసులు వారాంతపు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇంతలో మందుబాబులతో ఉన్న ఓ కారు దూసుకువచ్చింది. పోలీసులు ఆపబోతే వారి నుంచి తప్పించుకునేందుకు వేగంగా వెళుతూ, హోంగార్డు యాదగిరిని ఢీకొట్టింది. దీంతో యాదగిరికి ఒక కాలు, ఒక చెయ్యి విరిగి అక్కడికక్కడే కూలబడ్డాడు. ఆ కారు వెనుక సైరన్ మోగిస్తూ, పోలీసు వాహనాలు చేజ్ చేశాయి. చూసేవారికి సినిమా చేజింగ్ ను తలపిస్తూ, దూసుకెళ్లాయి. కొంతదూరం తరువాత బీభత్సం సృష్టించిన ఆ కారును పట్టుకున్నాయి. కారును నడుపుతున్న డ్రైవర్ అనీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ 09 సీఏ 44 నెంబర్ వున్న ఆ కారుపై ఇప్పటివరకూ 14 సార్లు ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. తాజాగా మరిన్ని సెక్షన్లతో కూడిన కేసులు పెట్టారు. తీవ్రంగా గాయపడిన యాదగిరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కారును స్వాధీనం చేసుకున్నామని అనీష్ ను సోమవారం నాడు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.