: అమరావతిని కలుపుతూ విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య హైస్పీడ్ సబర్బన్ రైళ్లు!
విజయవాడ, గుంటూరు, అమరావతి, తెనాలి ప్రాంతాలను కలుపుతూ, ప్రస్తుతం ఉన్న వనరులనే వాడుకుంటూ హైస్పీడ్ సబర్బన్ రైళ్లను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ ఢిల్లీ మెట్రో రైల్వే సంస్థకు లేఖ రాసింది. ఇటీవల విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) సందర్భంగా ఈ సబర్బన్ హైస్పీడ్ రైల్ ఆలోచన చంద్రబాబునాయుడుకు వచ్చింది. గతంలో విజయవాడ, గుంటూరు మధ్య ఎంఎంటీఎస్ తరహాలో రైళ్లను నడపాలని భావించినా, అది ఆచరణలోకి రాలేదు. ఇక విజయవాడలో మెట్రో రావాలంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈలోగా హైస్పీడ్ రైళ్లను తిప్పడం ద్వారా ప్రజల అవసరాలు తీర్చాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని బాబు సర్కారు భావిస్తోంది.