: మోదీతో ఒవైసీ భేటీ అయ్యారా?
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. బీహార్ శాసనసభ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ప్రధాని నరేంద్ర మోదీతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారనేది ఆ వార్త సారాంశం. మహా కూటమిని ఓడించేందుకు, ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకే వీరిద్దరి మధ్య రహస్య భేటీ జరిగిందని జేడీయూ ఆరోపిస్తోంది. ఈ వార్తలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని... వీరిద్దరి మధ్య ఎలాంటి భేటీ జరగలేదని... ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ వార్తలను ప్రధాని కార్యాలయం ఇంతవరకు ఎందుకు ఖండించలేదని జేడీయూ ప్రశ్నిస్తోంది. మరోవైపు, ఈ వార్తలను ఎంఐఎం కూడా ఖండించింది. అయితే, బీహార్ లోని సీమాంచల్ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ఎంఐఎం ప్రకటించింది.