: సూపర్ ఫాస్ట్ మోదీ... గంటన్నరలో ఓ బహిరంగ సభ, 40 మందితో చర్చలు
నిన్న తన 65వ పుట్టిన రోజును జరుపుకున్న మోదీ, నేడు సొంత నియోజకవర్గం వారణాసిలో సూపర్ ఫాస్ట్ టూర్ వేశారు. కేవలం గంటన్నర వ్యవధిలో ఓ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, సుమారు 40 మంది బీజేపీ నేతలతో సమావేశమై కాసేపు చర్చించారు. దాదాపు 9 నెలల తరువాత తన నియోజకవర్గానికి వచ్చిన ఆయన, ఏడు గంటల పాటు పర్యటించనున్నారు. భారీ వర్షాల కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ మోదీ పర్యటన ఈసారి మాత్రం ముందస్తు షెడ్యూల్ లేకుండానే ఖరారైంది. మధ్యాహ్నం తరువాత నగరంలో ట్రాఫిక్ జాంలను నివారించేందుకు తలపెట్టిన రింగ్ రోడ్డును, బనారస్ హిందూ యూనివర్శిటీలో ట్రామా సెంటర్ ను ఆయన ప్రారంభించనున్నారు. మోదీకి 'స్వచ్ఛ కాశీ'ని చూపాలన్న కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆ మేరకు నగరాన్ని పరిశుభ్రం చేసి ఆయనకు స్వాగతం పలికారు. గంగా నదిలో యాత్రికుల రవాణాకు సహకరిస్తున్న మత్స్యకారులకు 660 డస్ట్ బిన్ లను పంచారు. దీంతో పాటు టూత్ పేస్టు, బ్రష్, సోప్, షాంపూలు కలిగివుండే 6,600 'హైజీన్ కిట్స్'ను రోజువారీ కూలీలకు పంచారు. తమ సమస్యలను పరిష్కరించలేకపోయిన మోదీని అడ్డుకుంటామని వారణాసి ఉపాధ్యాయులు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లను చేశారు. మోదీ వారణాసి పర్యటన సాయంత్రం వరకూ సాగనుంది.