: నేతాజీ 1964 దాకా బతికే ఉన్నారా?... అవునంటున్న అమెరికన్ నిఘా వర్గాల నివేదికలు


నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు చనిపోయారు? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా స్పష్టమైన సమాధానమే లేదని చెప్పాలి. ఎందుకంటే, 1945లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారన్న వార్తలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేతాజీపై పరిశోధనలు చేసిన పలువురు జాతీయ, అంతర్జాతీయ పరిశోధకులు కూడా ఆయన మరణంపై భిన్నమైన వాదనలే వినిపించారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన నివేదికలు మాత్రం నేతాజీ 1964 దాకా బతికే ఉన్నారని చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థగా ఉన్న ‘ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ (ఓఎస్ఎస్)’ నేతాజీకి సంబంధించిన ఆసక్తికర అంశాలను పేర్కొంది. 1964 ఫిబ్రవరిలో నేతాజీ భారత్ కు తిరిగిరానున్నారని ఆ సంస్థ పేర్కొంది. 67 ఏళ్ల వయసులో ఉన్న నేతాజీ చైనా మీదుగా భారత్ తిరిగివస్తారని పేర్కొన్న ఆ నివేదిక, నేతాజీ రష్యా నుంచి రానున్నారన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక 1945లో నేతాజీ చనిపోయారన్న వాదన సరికాదని పరిశోధకుడు జయంతా చౌదరి వాదిస్తున్నారు. తన వాదనను బలపరచుకునేందుకు ఆయన నేతాజీ సోదరుడు శరత్ బోస్ 1949లో రాసిన కథనాన్ని ప్రస్తావిస్తున్నారు. నేతాజీ 1945లో చనిపోతే, 1949లో రాసిన కథనంలో శరత్ బోస్ తన సోదరుడు రెడ్ చైనాలో ఉన్నారని ఎలా రాస్తారని కూడా ఆయన వాదిస్తున్నారు. ఇదే వాదనను చౌదరి తైవాన్ విమాన ప్రమాదంపై విచారణ జరిపిన జస్టిస్ మనోజ్ ముఖర్జీ కమిషన్ ముందు వినిపించారు. ఇక నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేడు ఆయన కుటుంబ సభ్యులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాల్లో నేతాజీకి సంబంధించిన కీలక సమాచారం లభించే అవకాశం ఉందన్న వాదన కూడా లేకపోలేదు.

  • Loading...

More Telugu News