: భీకర సముద్రపు అలల మధ్య ప్రశాంతమైన దీవిలా కనిపిస్తున్న భారత్: రాజన్


ప్రపంచమంతటా స్టాక్ మార్కెట్లలో ఆర్థికమాంద్యం అలల ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ, ఇండియా ప్రశాంతమైన దీవిలా కనిపిస్తోందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో రాజన్ ప్రసంగించారు. పారిశ్రామికంగా ముందంజలో ఉన్న పలు దేశాల్లో ఇబ్బందులు అధికమయ్యాయని, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మార్చకపోవడంతో అనిశ్చితి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలో పెట్టుబడులకు మంచి రాబడి వస్తుందని, తమ డబ్బు క్షేమంగా ఉంటుందని విదేశీయులు మరింతగా విశ్వసిస్తున్నారని అంచనా వేశారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం ఏమంత ఆరోగ్యకరంగా కనిపించడం లేదని, ప్రత్యేక వడ్డీ రేట్లు, ప్రోత్సాహక స్కీములు ప్రజల ముందుకు రావాలని ఆయన అన్నారు. ఇండియాలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలను అమలు చేసే దిశగా అడుగులు పడాల్సి వుందని, ఈ విషయంలో బ్రెజిల్ నేర్పుతున్న పాఠాలను నేర్చుకుని, సరైన మార్గంలో సాగితే, ఇన్వెస్టర్లకు, ప్రజలకు మేలు కలుగుతుందని వివరించారు. వృద్ధి రేటు కొనసాగాలంటే, సంస్కరణల అమలు మాత్రమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డ రాజన్, సమీప భవిష్యత్తులో సైతం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ నిర్ణయాలు ఉంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News