: తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహాల విశేషాలు!
వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వీధివీధుల్లో గణనాథుల విగ్రహాలు విభిన్న రూపాల్లో కొలువుదీరాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 59 అడుగుల ఎత్తయిన గణపతి విగ్రహం, ఈ సంవత్సరం త్రిశక్తి మయ మోక్ష గణపతి ఆకారంలో భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఇక విజయవాడ సత్యనారాయణపురంలో 63 అడుగుల ఎత్తయిన నాట్య గణపతి భక్తులను ఆకర్షిస్తుండగా, ఈ రెండు విగ్రహాల ముందూ 6 వేల కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఉంచారు. ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాలకు ప్రధాన వేదికగా నిలిచిన రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రూ. 2 లక్షల విలువైన నాణాలతో చింతామణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నం పరిధిలోని గాజువాక వద్ద వుడా రెండు రోడ్ల కూడలిలో 100 అడుగుల విష్ణురూప గణపతి, ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలిచింది. గాజువాకలో 80 అడుగుల వెంకటేశ్వర రూప గణపతిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వరసిద్ధి వినాయకుడు కొలువైన కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుండగా, పూర్తిగా పసుపుతో తయారు చేసిన గణనాథుని ప్రతిమ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ సంవత్సరం 'బాహుబలి' గణపతి ఎన్నో ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాడు. శివలింగాన్ని మోస్తున్న గణనాథుని ప్రతిమలు వందలాదిగా ఏర్పాటయ్యాయి. క్రికెట్ గణపతి, టెన్నిస్ గణపతి, చేత్తో స్వయంగా లడ్డూలు పంచే గణపతి... ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నెన్నో రూపాల్లో కొలువైన విఘ్నాధిపతిని దర్శించి, పూజించి తరించేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.