: బీసీసీఐ చీఫ్ దాల్మియాకు గుండెపోటు... బీఎం బిర్లా ఆసుపత్రిలో చికిత్స
భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) చీఫ్ జగ్ మోహన్ దాల్మియా గుండెపోటుకు గురయ్యారు. నిన్న రాత్రి 10 గంటలకు గుండెపోటు రాగా ఆయనను హుటాహుటీన కోల్ కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం దాల్మియాకు చికిత్స జరుగుతోంది. గతంలో సుదీర్ఘకాలంగా బీసీసీఐ పగ్గాలు చేపట్టిన దాల్మియా చాలాకాలం పాటు బోర్డుకు దూరంగానే ఉన్నారు. అయితే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కారణంగా మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన దాల్మియా మరోమారు బోర్డు పగ్గాలు చేజిక్కించుకున్నారు. రెండో దఫా బోర్డు పగ్గాలు చేపట్టే నాటికే దాల్మియా అనారోగ్యంతో ఉన్నారు. గుండెపోటు నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.