: కేఈకి అర్ధరాత్రి ఝలక్కిచ్చిన చంద్రబాబు... సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పెరిగిన దూరం!


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిల మధ్య దూరం మరింత పెరిగిందనే చెప్పాలి. ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి హోదాలో నిన్న కేఈ 22 మంది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)లను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం హోదాలో చంద్రబాబు నిలిపేశారు. ఈ మేరకు కేఈ జారీ చేసిన నాలుగు ఉత్తర్వులను ఒకే ఓక్క జీవోతో సీఎంఓ కార్యాలయం నిలిపేసింది. వివరాల్లోకెళితే... రాష్ట్రంలోని 22 మంది ఆర్డీఓలను బదిలీ చేయాలన్న కేఈ ఆదేశాలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నిన్న జీవో ఎంఎస్ నెం. 872, 873, 874, 876లతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఐదు నెలల క్రితం విశాఖ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు పేరుతో పాటు ఏలూరు ఆర్డీఓ పేరు కూడా ఉంది. ఒకేసారి 22 మంది ఆర్డీఓలను బదిలీ చేస్తూ కేఈ తీసుకున్న నిర్ణయంపై ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులను కూడా చెప్పాపెట్టకుండా బదిలీ చేయడమేమిటని వారు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారట. దీంతో వెనువెంటనే బదిలీలపై ఆరా తీసిన చంద్రబాబు, బదిలీ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బదిలీలను నిలుపుదల చేస్తూ జీవో నెం. 882 జారీ చేశారు. ఇందులో గమనించదగ్గ విషయమేంటంటే... 22 మంది ఆర్డీఓలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చిన జేసీ శర్మ, వాటిని నిలుపుదల చేస్తూ ఆయనే ఆదేశాలు జారీ చేశారు. గతంలో విశాఖ ఆర్డీఓ బదిలీ విషయంలో కేఈ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. తాజాగా 22 మంది అధికారులను బదిలీ చేస్తూ కేఈ జారీ చేసిన ఉత్తర్వులను కూడా చంద్రబాబు నిలుపుదల చేయించడంతో వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందనే చెప్పాలి.

  • Loading...

More Telugu News