: శివమణి నాదానికి పులకించిన కేసీఆర్!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... డ్రమ్మర్ శివమణి వివిధ డ్రమ్స్ పై సృష్టించిన నాదానికి పులకించిపోయారు. అంతే, తన మెడలోని మాలను తీసి శివమణి మెడలో వేసి శభాష్ అన్నారు. జానపద సినిమాల్లోని సంఘటనలను గుర్తు చేసే ఈ ముచ్చట హైదరాబాదులోని శంషాబాదులో చోటుచేసుకుంది. శంషాబాదు విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన కేసీఆర్ అక్కడికి దగ్గర్లోని త్రిరంగానగర్ లోని దివ్యసాకేతంలో సన్నిహితుడైన మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు షష్టి పూర్తి వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ సంగీత వాయిద్యకారుడు శివమణి సంగీత విభావరి ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ఆసాంతం తిలకించిన కేసీఆర్, చిన్నజీయర్ స్వామి పులకించిపోయారు. శివమణి కోరికపై చిన్నజీయర్ స్వామి కూడా వాయిద్యం వాయించి అలరించారు. ఆహూతులంతా మైమరచి శివమణి సంగీత విభావరిని తిలకించారు. సంగీత విభావరి పూర్తైన తరువాత శివమణి అందరికీ అభివాదం చేసి, కేసీఆర్ కు కూడా ప్రణామం చేయగా, పులకించిపోయిన కేసీఆర్, తనను సత్కరించిన మాలను తీసి శివమణి మెడలో వేశారు. అనంతరం తన మెడలో ఉన్న శాలువాను కూడా తీసి శివమణి మెడలో వేశారు.

  • Loading...

More Telugu News