: 368 ప్యూన్ ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు... పీహెచ్ డీలూ ఉన్నారు!
దేశంలో నిరుద్యోగ సమస్యను కళ్లకు కట్టే చిత్రం ఉత్తరప్రదేశ్ లో సాక్షాత్కరించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 368 ప్యూన్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటిస్తూ, దరఖాస్తులను ఆహ్వానించింది. అంతే, నిరుద్యోగులు వెల్లువలా దరఖాస్తులు పంపారు. 368 ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రెండు లక్షల మంది ఎంటెక్, బీటెక్ పూర్తి చేసినవారని, పీజీ, డిగ్రీ విద్యార్థులు సరేసరని, పీహెచ్ డీ పట్టభద్రులు 255 మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ప్యూన్ ఉద్యోగాలకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని సచివాలయ ఉద్యోగి తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించి భర్తీ చేసేందుకు రెండేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పీహెచ్ డీ చేసి ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పనిచేయడం మేలు కదా? అని ఓ స్కాలర్ అభిప్రాయపడగా, బాగా చదవి ఎవరిమీదో ఆధారపడి బతికే కన్నా అధికారులకు నీళ్లు అందించడం కూడా గౌరవమే కదా? అని ఓ పట్టభద్రురాలు పేర్కొంది.