: భార్య, కుమార్తె ఉండగానే మరో ప్రేమ... చివరికి ప్రియురాలితో కలసి ఆత్మహత్య
37 ఏళ్ల సతీష్ విశాఖపట్నంలో శాంసంగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి తాళి కట్టిన భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఇంతలో ఎంబీఏ చదువుతున్న సింధూర (24) అతనికి పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారం సతీష్ భార్య సంగీతకు తెలిసిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్తపై మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా సంగీత ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, పెద్దమనుషుల సమక్షంలో కూడా ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత భార్యాభర్తలు కలిసే ఉన్నారు. కానీ, సింధూరతో తన భర్త ప్రేమాయణం ఇంకా కొనసాగుతూనే ఉందన్న విషయం తెలియడంతో... ఇద్దరి మధ్య రెండు రోజుల క్రితం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత తన కుమార్తెను తీసుకుని అత్తగారింటికి వెళ్లిన సంగీత... తన బాధనంతా చెప్పుకుని రోదించింది. మరోవైపు, కాలేజీకి పోతున్నానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన సింధూర తన ప్రియుడు సతీష్ వద్దకు వచ్చింది. అనంతరం ఇద్దరూ కలసి ధర్మారం సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మృత దేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. ఘటనా స్థలంలో సతీష్ కు చెందిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న డైరీలో... "నీవు, నేను, సింధూర ముగ్గురం కలసి ఉందామన్నా మీరెవరూ ఒప్పుకోవడం లేదు. ఇద్దర్నీ బాగా చూసుకుంటానని చెబుతున్నా నమ్మడం లేదు. మా చావుకు ఎవరూ కారణం కాదు" అని సతీష్ రాసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు తీవ్ర వేదనలో మునిగిపోయాయి. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.