: ప్రపంచమంతటినీ ఆకర్షిస్తున్న బీహార్ ఎన్నికలు... ఎందుకంటే...!
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, బీహార్ ఎన్నికలపై విదేశాలు చూపుతున్నంత ఆసక్తి ముందెన్నడూ కనిపించలేదు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాలు అక్టోబర్ లో జరిగే ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. తదుపరి రెండు మూడేళ్లలో దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, పెట్టుబడి అవకాశాలను ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయని విదేశీ ఇన్వెస్టర్లు నమ్ముతుండటమే ఇందుకు కారణం. మోదీ గ్లామర్, 'మేకిన్ ఇండియా' కొనసాగాలంటే, ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించాల్సి వుంది. ఒకవేళ బీజేపీ ఓడిపోయిన పక్షంలో సంస్కరణల అమలు నిదానిస్తుందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడచిన సంవత్సరం వ్యవధిలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, వాటిపై విదేశీ పెట్టుబడిదారులు ఇంత ఆసక్తిని చూపలేదు. ఇప్పటికే సంస్కరణలకు అనుమతి పొందడంలో రాజ్యసభలో బీజేపీకి చిక్కులు ఎదురవుతున్నాయి. సరైన మెజారిటీ లేకపోవడంతో ఎన్డీయే కూటమికి అడ్డంకులు వస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఆ మేరకు రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకోగలుగుతుంది. ఇదే సమయంలో ఆయన నిర్ణయాలకు ప్రజల ఆమోదం ఉందన్న సంకేతాలూ వెలువడతాయి. బీహార్ లో సూక్ష్మ స్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీకి విజయావకాశాలు ఎంత ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకునేందుకు కొన్ని దేశాల ద్వైపాక్షిక కమిటీలు బీహార్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నాయి. దీన్ని బట్టే తెలుస్తోంది ఈ ఎన్నికలు బీజేపీకి ఎంత ముఖ్యమో!