: ఈ సామెతల బాబు మోసపు మాటలు అన్నీ ఇన్నీ కావయా!: జగన్ ఎద్దేవా


ప్రత్యేక హోదా, ప్యాకేజీలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చెప్పిన సామెతను మరోసారి గుర్తు చేసుకున్న జగన్, ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. "ఆడబిడ్డలకు తోడుగా మేమున్నాము" అని చెప్పాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి, వారిని కించపరుస్తూ "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?" అని సామెతలు చెబుతున్నాడని అన్నారు. హోదా కన్నా ప్యాకేజీ ఏ మేరకు గొప్పదన్న విషయాన్ని ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో హక్కుగా ఇస్తామని చెప్పిన విషయాలను, నేడు ప్యాకేజీ రూపంలో తెస్తూ, ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని, రోజుకో రకం అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. మిగతా రాష్ట్రాలు అడ్డని చెబుతున్న చంద్రబాబు, ఆనాడు విభజన సమయంలో అవే రాష్ట్రాలను ఎలా మరచిపోయారన్న విషయాన్ని విద్యార్థులు నిలదీయాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని జగన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులను రాష్ట్రాలకు ఎలా పంచాలన్నదే ఆర్థిక సంఘం ముఖ్య విధి అని, హోదా ఇవ్వాలా? వద్దా? అన్నది ప్రధాని, క్యాబినెట్ కు మాత్రమే సంబంధించిన విషయమని తెలిపారు. ప్రధాని చేతుల్లోనే ఎన్డీసీ (నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్) పనిచేస్తుందని, నీతి అయోగ్ కూ ఆయన హెడ్ గా ఉన్నారని గుర్తుచేస్తూ, ఆయనపై ఒత్తిడి వస్తే హోదా వచ్చేస్తుందని అన్నారు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, అవన్నీ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలేనని, అవన్నీ తెలిసి కూడా చంద్రబాబు కావాలనే మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఈ సామెతల బాబు ఏమైనా చెబుతాడని, వాటిని నమ్మవద్దని విమర్శించారు. హోదా వచ్చి అన్ని రాయితీలూ వస్తేనే పారిశ్రామికవేత్తలు ఆకర్షితులై రాష్ట్రానికి వస్తారని, అప్పుడు మాత్రమే యువతకు లక్షల్లో ఉద్యోగాలు దగ్గరవుతాయని అన్నారు. ఆ విషయం తెలిసి కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఆయన తెలిసి చేస్తున్నాడో... తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News