: మరో 26 మంది అమాయకులను బలిగొన్న ఐఎస్
సిరియాలో ఐఎస్ఐఎస్ ఆగడాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ముష్కరుల బారి నుంచి తప్పించుకునేందుకు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని లక్షలాది మంది సిరియా నుంచి యూరోపియన్ దేశాలకు వలస వెళుతున్నారు. అయినప్పటికీ, ఐఎస్ ఉగ్రవాదులు తమ పంథా మార్చుకోవడం లేదు. తాజాగా హసఖ్ ప్రావిన్స్ లోని ఖష్మాన్ అనే ప్రాంతంలో ఓ వాహనంలో అమర్చిన బాంబును పేల్చి వేశారు. అలాగే, మహట్టా అనే ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనల్లో 26 మంది అమాయకులు దుర్మరణం పాలయ్యారు. మరో 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే అని సమాచారం. ఈ దాడుల్లో ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంది.