: దూసుకుపోతున్న సైబర్ ఇన్స్యూరెన్స్... అపాయాలూ దాగున్నాయ్!
సైబర్ ఇన్స్యూరెన్స్... ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న పదం. బీమా పథకాలను ఏ విధమైన కాగితాల రూపంలో కూకుండా, పూర్తిగా ఆన్ లైన్ విధానంలో కొనుగోలు చేసి, ప్రీమియంలు సైతం ఆన్ లైన్లో చెల్లించడమే సైబర్ ఇన్స్యూరెన్స్. వచ్చే మూడేళ్లలో అంటే 2018 నాటికి సైబర్ ఇన్స్యూరెన్స్ 5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 33 వేల కోట్లు), ఆపై 2020 నాటికి 7.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 49,500 కోట్లు) విస్తరిస్తుందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ తన సర్వే అనంతరం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 'ఇన్స్యూరెన్స్ 2020 అండ్ బియాండ్' పేరిట నివేదిక విడుదల కాగా, ఇందులో అభిప్రాయాలను పంచుకున్న 61 శాతం మంది వ్యాపార దిగ్గజాలు, ఈ విభాగం సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలే అధికమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సైబర్ దాడులు జరిగి ఈ రంగం కుదేలు కావచ్చని సర్వేలో పాల్గొన్న 71 శాతం బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు, 79 శాతం మంది బ్యాంకింగ్ రంగ సీఈఓలు వివరించారు. వినియోగదారుల అలవాట్లు వేగంగా మారిపోతున్నాయని, అందుబాటులోకి వస్తున్న సాంకేతికత వారిని బీమా కంపెనీల వైపు కాకుండా, వారు నడిపిస్తున్న వెబ్ సైట్ల వైపు పయనించేలా చేస్తున్నాయని పీడబ్ల్యూసీ డైరెక్టర్ అనురాగ్ సుందర్ వివరించారు. ఇప్పుడిప్పుడే పరుగందుకుంటున్న సైబర్ ఇన్స్యూరెన్స్ విభాగం మరింతగా విస్తరించిన తరువాత దాడులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. 2011లో ప్రపంచంలోనే అత్యధిక సైబర్ దాడులు జరిగిన దేశాల్లో ఇండియా టాప్-10లో నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, 2014 నాటికి రెండో స్థానానికి ఎగబాకిందని, ఇక బీమా కంపెనీపై దాడి జరిగితే, అది ఎంతో మందికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. బీమా కంపెనీలు, రీ ఇన్స్యూరర్లు, బ్రోకర్లు సైబర్ రిస్క్ పై కన్నేసి, దాన్ని ఎదుర్కొనేందుకు తగినంత రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి వుందని సూచించారు.