: ఏంటీ ర్యాంకులు... ఎన్డీయే భాగస్వామ్య రాష్ట్రాలే వ్యాపారానికి అనుకూలమా?... ప్రపంచ బ్యాంకు ర్యాంకులపై విమర్శలు
ఇండియాలో వ్యాపారం చేసుకునేందుకు అనువైన రాష్ట్రాల జాబితా పేరిట సోమవారం నాడు ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ర్యాంకులపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీయే మిత్రులుగా ఉన్న వారు పాలిస్తున్న రాష్ట్రాలకు పెద్దపీట వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ జాబితాలో టాప్-5లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండగా, 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తున్న కర్ణాటకకు 9, కేరళకు 18వ ర్యాంకు లభించాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలూ పెట్టుబడులకు అనుకూలంగానే ఉన్నాయని మాజీ వాణిజ్య మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. "ఇది ఓ ప్రచారం మాత్రమే. 2000 నుంచి 2014 వరకూ వివిధ రాష్ట్రాలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల వివరాలు ఆర్బీఐ వద్ద ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే, మహారాష్ట్ర ముందు నిలువగా, ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లు ఉన్నాయి. ఎంత విదేశీ పెట్టుబడిని ఆకర్షించగలిగిందన్న విషయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, గుజరాత్ అసలు మొదటి స్థానంలోనే ఉండదు" అని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఓ చెడు రూపాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. కాగా, కర్ణాటక రాష్ట్రం టాప్-5లో ఉంటుందని అంతకుముందు నిపుణులు భావించారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఈ-గవర్నెన్స్ విధానం ఎన్నో కంపెనీలను ఆకర్షిస్తోంది. లంచాల ఆరోపణలు, అక్రమంగా నిధుల తరలింపు, బొగ్గు కుంభకోణాలు వెల్లువెత్తిన జార్ఖండ్ రాష్ట్రాన్ని టాప్-3గా ప్రకటించడం, పలు ప్రముఖ విదేశీ కంపెనీలను దూరం చేసుకున్న ఒడిశాను 7వ స్థానంలో చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇదే జాబితాలో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. వాస్తవానికి నూతన పెట్టుబడుల విషయంలో తెలంగాణ సంతృప్తికరంగానే పయనిస్తోంది. కేసీఆర్ సర్కారు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తరువాత వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే, ఎఫ్‌డీఐని ఆకర్షించడంలో ముందు నిలిచేది ఆ రాష్ట్రమే. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 7 శాతం తమిళనాడుకే వచ్చాయి. ఈ రాష్ట్రానికి లభించిన ర్యాంకు 12. తమిళనాడు కన్నా ఉత్తరప్రదేశ్ (10)లో సులువుగా వ్యాపారాలు చేసుకోవచ్చని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని తమిళ పార్టీలు విరుచుకుపడుతున్నాయి.