: 'రివర్స్ దండి యాత్ర' పేరును మార్చిన హార్దిక్
తాము తలపెట్టిన 'రివర్స్ దండి యాత్ర' పేరును 'ఏక్తా యాత్ర'గా మారుస్తున్నట్టు గుజరాత్ పటేళ్ల వర్గం నేత హార్దిక్ పటేల్ వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వంతో పటేల్ ప్రతినిధుల సమావేశం తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయిన దండి యాత్ర పేరును వాడుకోరాదని వచ్చిన విజ్ఞప్తి మేరకే పేరును మార్చామని వివరించారు. కాగా, రిజర్వేషన్లపై డిమాండ్లను వినిపించే సమయంలో విధివిధానాలు పాటించాలని పటేల్ పెద్దలకు గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్ సూచించారు. నిరసనలు హింసాయుతంగా ఉండరాదని తేల్చి చెప్పారు. సుమారు 15 మంది పటేల్ వర్గం నేతలు ప్రభుత్వంతో చర్చలు జరిపారని, వారి డిమాండ్లన్నీ విన్నామని గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని తెలిపారు.