: పదవి నుంచి దిగుతున్న ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్
ఆస్ట్రేలియా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గడచిన రెండేళ్లలో ముగ్గురు ప్రధానులు మారారు. ఇప్పుడు నాలుగో ప్రధాని ఆస్ట్రేలియా పీఠం అధిష్ఠించనున్నారు. ఆస్ట్రేలియాలో ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడై ఉండాలన్నది నిబంధన. ఈ నిబంధన కారణంగానే లేబర్ పార్టీ నాయకత్వ మార్పుతో 2013లో జూలియా గిలార్డ్ పదవీచ్యుతులయ్యారు. ఆమె స్థానంలో కెవిన్ రూడ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కొద్ది నెలలకే జరిగిన సాధారణ ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో కెవిన్ రూడ్ ప్రధాని పదవి నుంచి తొలగిపోగా, ఆయన స్థానంలో టోనీ అబాట్ ప్రధాని పదవి చేపట్టారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమవడం, ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లకపోవడంతో అబాట్ పై పార్టీలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సొంత పార్టీలోనే ముసలం పుట్టింది. వైరి వర్గానికి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మాల్కం టర్న్ బుల్ నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 18న జరిగిన లిబరల్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో 54-44 ఓట్ల తేడాతో మాల్కం టర్న్ బుల్ చేతిలో టోనీ అబాట్ ఓటమిపాలయ్యారు. దీంతో అబాట్ రాజీనామా అనివార్యమైంది. ఆయన గవర్నర్ కు రాజీనామా సమర్పించిన వెంటనే పదవీ బాధ్యతలు చేపడతానని మాల్కం టర్న్ బుల్ ప్రకటించడం విశేషం. కాగా, గతంలోనే మాల్కం ప్రధాని పదవి చేపట్టాల్సింది కానీ, కేవలం ఒకే ఒక ఓటు తేడాతో టోనీ అబాట్ విజయం సాధించడంతో ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు.