: ఉత్పత్తి, వ్యవసాయ రంగాలకంటే టూరిజమే బెస్టు: చంద్రబాబు
ఉత్పత్తి, వ్యవసాయ రంగాలకంటే టూరిజమే బెస్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన టూరిజమ్ మిషన్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఉత్పత్తి రంగంలో ఓ మోస్తరు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు, వ్యవసాయ రంగంలో అదే మొత్తంతో 42 శాతం లాభాలు సాధించవచ్చని, అదే టూరిజంలో అయితే 72 శాతం లాభాలు గడించవచ్చని అన్నారు. టూరిజం రంగంలో ఆంధ్రప్రదేశ్ కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కేరళ తరహా గ్రీనరీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే సాధ్యమని ఆయన చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో కోకనట్ గార్డెన్స్, పంటపొలాలు, గోదావరి నది అందాలు అద్భుతమైనవని ఆయన తెలిపారు. అక్కడి నుంచి విశాఖకు వెళ్తే ఒకవైపు సముద్రం, ఎర్ర మట్టిదిబ్బలు, కాస్త దూరంలో అరకు అందాలు, అద్భుతమైన హిల్ స్టేషన్ ఉన్నాయని చెప్పిన ఆయన, టూరిజం వ్యాపారంలో వీటిని బాగా వినియోగించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాజధానిని ప్రపంచంలోనే గొప్పగా నిర్మిస్తామని, అదొక టూరిజం స్పాట్ గా ఏర్పడుతుందని ఆయన తెలిపారు. టూరిజం ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన ఒప్పందాలు చేసుకున్నారు.