: అవర్ వెంకటేశ్వర స్వామి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్...: ఇన్వెస్టర్లకు విడమరిచి చెప్పిన చంద్రబాబు


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఎంతటి శక్తిమంతుడో, భక్తుల కోరికలను ఎలా నెరవేరుస్తాడో, ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ఆంగ్లంలో చెబుతుంటే, ఆహూతులు నవ్వాపుకోలేకపోయారు. ఈ మధ్యాహ్నం ఏపీ టూరిజం పాలసీని విడుదల చేసిన తరువాత బాబు ప్రసంగించారు. నవ్యాంధ్రలో పిలిగ్రమ్ టూరిజం మాత్రమే వృద్ధిలో ఉందని, ఇదే పెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. "అవర్ వెంకటేశ్వర స్వామి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్" అనగానే సభికులు నవ్వుల్లో మునిగిపోయారు. "ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ హిందూ గాడ్. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు కూడా. ఆయనకు రూ. 10 వేల కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు ఉన్నాయి. రోజుకు సుమారు 70 వేల మందికి దర్శనమిస్తుంటాడు. ఆయన సమక్షంలో అన్నదానం నిమిత్తం రూ. 650 కోట్ల మూలధనం నిల్వలున్నాయి. ఆ డబ్బుపై వచ్చే వడ్డీతోనే రోజుకు లక్ష మంది కడుపు నింపవచ్చు. ఇటీవల ప్రాణదానం పేరిట స్కీం ప్రారంభిస్తే రూ. 250 కోట్లు వచ్చాయి. ఆయన పేరిట వివిధ ప్రాంతాల్లో గుడులు కట్టి విజయవంతం అయ్యాం. చెన్నైలోని గుడి నుంచి రూ. 25 కోట్ల ఆదాయం వస్తోంది. భక్తులను ఆశీర్వదించడంలోనే కాదు, వారి బాధలను, సమస్యలను తీర్చడంలో, భక్తితో కోరిన కోరికలను నెరవేర్చడంలో కూడా మోస్ట్ పవర్ ఫుల్" అన్నారు. రాష్ట్రంలో రూ. కోటికి పైగా ఆదాయాన్ని తెస్తున్న దేవాలయాల సంఖ్య 160కి పైగా ఉందన్నారు. ఇక రూ. 25 లక్షలకు పైగా ఆదాయం వస్తున్న దేవాలయాలు 3 వేలకు పైగానే ఉన్నాయని, వీటన్నింటినీ మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News