: క్వికర్, ఓఎల్ఎక్స్ లో ఆవులూ గేదెలూ!
శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో ఫర్నీచర్, ఆటోమొబైల్, మొబైల్స్ వంటి సెకండ్ హ్యాండ్ వస్తువులు క్వికర్, ఓఎల్ఎక్స్ వంటి వెబ్ సైట్ల ద్వారా అమ్మకాలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ఇప్పుడీ వెబ్ సైట్లు మరో అడుగు ముందుకేసి, పక్షులు, పిల్లులు, శునకాలను కూడా తమ సైట్ల ద్వారా విక్రయిస్తున్నాయి. తాజాగా, ఈ జాబితాలో ఆవులూ, దూడలు, గేదేలు, గొర్రెలు కూడా వచ్చి చేరాయి. తమిళనాడుకు చెందిన రైతులు ఈ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇందుకు సంబంధించిన సుమారు 500 ప్రకటనలు ఓఎల్ఎక్స్ లో దర్శనమిస్తున్నాయి. ఆవులు, మేకలు, గొర్రెలను అమ్ముతామంటూ ఇస్తున్న ప్రకటనలే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని సదరు రైతులను ప్రశ్నిస్తే...మధ్యవర్తులు, దళారుల కన్నా డిజిటల్ పద్ధతిలో అమ్మకాలు కొనసాగించడం సులభంగా ఉంటుందని సమాధానం చెప్పారు. అమ్మదలచుకున్న జంతువులను వేరే ప్రదేశాలకు వాహనాల్లో తీసుకెళ్లడం కన్నా ఈ విధానం చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. విక్రయించదలచుకున్న జంతువు ఫొటో అప్ లోడ్ చేయడం, సంబంధించిన వ్యక్తితో ఫోన్ లో మాట్లాడటం వంటివి తమకు గమ్మత్తయిన అనుభూతినిస్తున్నాయని రైతులు పేర్కొన్నారు. అయితే, ఇంటర్నెట్ పై, ఆయా సైట్లపై అవగాహనలేని రైతులు అందులో చేయి తిరిగిన వారిని సంప్రదించి వారి పనులు చక్కబెట్టుకుంటుండటం గమనార్హం.