: టోకు ధరలన్నీ దిగొచ్చాయట... ప్రభుత్వ లెక్కలు నమ్మేదెలా?


ఇండియాలో టోకు ధరలు దిగొచ్చాయట. ఈ ఉదయం కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆగస్టు నెలలో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 4.95 శాతానికి పడిపోయింది. అంతకుముందు జూలైలో 4.05 శాతంగా ఉన్న ఇన్ ఫ్లేషన్, వ్యతిరేక దిశకు పడిపోవడానికి కమోడిటీ ధరల తగ్గుదలే కారణమని కేంద్రం ప్రకటించింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా పదవ నెలలోనూ తగ్గినట్లయింది. ప్రధానంగా గత సంవత్సరంతో పోలిస్తే ఇంధన ధరలు 16.5 శాతం తగ్గడం మొత్తం గణాంకాలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆహార ఉత్పత్తుల ధరలు 1.13 శాతం తగ్గాయని వివరించారు. ఉత్పత్తి రంగంలో ధరలు జూలైతో పోలిస్తే 1.92 శాతం తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. జూలైలో చిల్లర ద్రవ్యోల్బణం సూచి (రిటైల్ ఇన్ ఫ్లేషన్) రికార్డు స్థాయిలో 3.78 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరగడం ఎంత ప్రమాదకారో, ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) నమోదై గణాంకాలు 'మైనస్'లోకి వెళ్లడమూ అంతే ప్రమాదాన్ని సూచిస్తుందని మోడీస్ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, ఇప్పటికే దేశంలో పప్పుధాన్యాలు, ఉల్లి వంటి నిత్యావసరాలు, నూనెల ధరలు ఆకాశానికి ఎగబాకి సామాన్యులకు దూరమైన సంగతి తెలిసిందే. కేంద్ర గణాంకాలు వాస్తవ రూపాన్ని ప్రతిబింబించడం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం పెట్రోలు, బంగారం వంటి ఉత్పత్తుల ధరల పతనంతోనే ద్రవ్యోల్బణం వ్యతిరేక స్థితిలోకి వెళ్లింది తప్ప సామాన్యులకు దక్కిన ప్రయోజనాలు శూన్యమని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News