: మేమంతా ఇండియన్స్, బాంబులేస్తున్నారు, చంపేస్తున్నారు, ప్లీజ్ సేవ్... విదేశాంగ శాఖకు ఆడియో మెసేజ్
భారత విదేశీ వ్యవహారాల శాఖకు వచ్చిన ఆడియో మెసేజ్ గల్ఫ్ దేశమైన యెమెన్ లో భారతీయులు పడుతున్న ఇక్కట్లను చెప్పకనే చెబుతోంది. "ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. బాంబులు వేస్తున్నారు. మేము కచ్ఛితంగా చనిపోతాం. ఈలోగా దయచేసి మమ్మల్ని రక్షించండి. మేమంతా భారతీయులం" అంటూ మెసేజ్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం గుజరాత్ నుంచి వస్తు రవాణా కోసం యెమన్ లోని ఖోఖా నౌకాశ్రయానికి వెళ్లారు. వీరు అక్కడి తీరం చేరకముందే బాంబు దాడులు మొదలయ్యాయి. మొత్తం 70 మంది ఐదు పడవల్లో వెళ్లగా, బాంబు దాడుల నుంచి వీరు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు తీరం చేరి ప్రాణాలు రక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. వీరు ప్రయాణించిన పడవలూ ధ్వంసమయ్యాయి. దీంతో తమకు అందుబాటులో ఉన్న ఫోన్లతో సమాచారాన్ని పంపారు. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ, వారిని ఇండియాకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని వెల్లడించింది.