: జామాయిల్ తోటల్లో పనులకెళ్లి...సొంతూళ్లకు తిరిగివస్తూ మృత్యువాత పడ్డ కూలీలు


తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారంతా దినసరి కూలీలే. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు, రౌతలపాటు, తొండంగం, శంఖవరం, యూ.కొత్తపల్లి మండలాలకు చెందిన దాదాపు 35 మంది కూలీలు గత నెల 26న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని జామాయిల్ తోటల్లో పనిచేసేందుకు వెళ్లారు. దాదాపు 20 రోజులుగా తోటల్లో పనిచేసిన కూలీలు నిన్న సాయంత్రం తమ స్వస్థలాలకు బయలు దేరారు. ఆర్టీసీ బస్సులో సగం దూరం ప్రయాణించిన వీరంతా ఏలూరు బైపాస్ వద్ద విశాఖ వైపు వెళుతున్న లారీని ఎక్కారు. విజయవాడ నుంచి విశాఖకు ఫ్లైయాష్ తో వెళుతున్న ఈ లారీలో ఒకేసారి 35 మంది కూలీలను డ్రైవర్ ఎక్కించుకున్నాడు. అతి వేగంతో దూసుకెళుతున్న ఈ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద బోల్తా కొట్టింది. మరో అరగంట గడిచి ఉంటే కూలీలంతా తమ స్వస్థలాలకు సమీపంలో లారీ దిగిపోయేవారే. అయితే లారీ తిరగబడటంతో ఫ్లైయాష్ పై కూర్చున్న వారంతా లారీ కింద నలిగిపోయారు. కూలీలపై ఫ్లైయాష్ తో పాటు లారీ కూడా పడటంతో మెజారిటీ కూలీలు అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. ఇక గాయపడ్డ 16 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి రాజమండ్రిలోని ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News