: 90 మందిని పొట్టనబెట్టుకున్న ఆ పేలుళ్లకు కారణం గ్యాస్ సిలిండర్లు కాదు!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబువా జిల్లాలోని ఒక రెస్టారెంట్ లో శనివారం నాడు గ్యాస్ సిలిండర్లు పేలుడు వల్లే ప్రమాద సంఘటన జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ ప్రమాద ఘటనకు కారణం గ్యాస్ సిలిండర్లు కావని తేలింది. దీనికి కారణం రెస్టారెంట్ ను ఆనుకుని ఉన్న ఒక షాపులో దాచి ఉంచిన పేలుడు పదార్థాలేనని పోలీసులు స్పష్టం చేశారు. గనుల్లో పేల్చేందుకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ ను ఈ షాపు (చిన్న పిండిమరకు చెందిన షాపు)లో అక్రమంగా నిల్వ చేసి ఉంచారని చెప్పారు. అక్కడ సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా జిలెటిన్ స్టిక్స్ పేలి ఇంత ఘోర ప్రమాదం జరిగింది. మైనింగ్ వ్యాపారి కూడా అయిన రాజేంద్ర కాశ్వాకు జిలెటిన్ స్టిక్స్ ను విక్రయించేందుకు లైసైన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద సంఘటన జరిగిన తర్వాత సదరు వ్యాపారి కుటుంబం ఇక్కడి నుంచి ఎటో వెళ్లిపోయారని తెలుస్తోంది. కాగా, స్థానికులు చెబుతున్నది మాత్రం వేరే విధంగా ఉంది. ఈ పేలుడు పదార్థాలను రాజేంద్ర కాశ్వా అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో సుమారు ఏడాదిగా ఈ తతంగం నడుపుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ స్థానిక అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు. కాశ్వా అక్రమవ్యాపారం గురించి తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని, అయినా ఫలితం లేకుండా పోయిందని చాన్ లాల్ అనే స్థానికుడు చెప్పారు. 90 మంది మృతి చెందిన ఈ ప్రమాద సంఘటనలో సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. కాగా, సంఘటనా స్థలాన్ని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ ఈరోజు సందర్శించారు. ప్రమాద కారకుడిని తక్షణం అరెస్టు చేయాలంటూ సీఎం కాన్వాయ్ ను నిరసన కారులు అడ్డుకున్నారు.