: సొంతూరికే ‘స్మార్ట్’ హోదా ఇవ్వలేదు...ఇక విజయవాడకు ఎలా ఇస్తా?: వెంకయ్య వ్యాఖ్య
స్మార్ట్ సిటీల ప్రకటనకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సొంతూరికే స్మార్ట్ సిటీ ప్రకటించని తాను, విజయవాడకు ఎలా ఇస్తానని వ్యాఖ్యానించారు. నిన్న విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని గతంలో వెంకయ్య చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ఆయనకు గుర్తు చేశారు. దీనికి స్పందించిన వెంకయ్య ‘‘నా సొంతూరు నెల్లూరు నగరాన్నే స్మార్ట్ సిటీగా ఎంపిక చేయలేదు. విజయవాడను ఏ విధంగా ఎంపిక చేస్తాం? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ నెల్లూరులోనే ఉన్నాం. అయినా ఆ నగరాన్నే ఎంపిక చేయనప్పుడు విజయవాడ ఎలా ఎంపికవుతుంది?’’ అని వెంకయ్య అన్నారు. ఆయా నగరాల్లో వసూలవుతున్న పన్ను, పౌర సేవలను ప్రాతిపదికగా చేసుకుని స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశామని చెప్పిన వెంకయ్య, ఈ విషయాల్లో విజయవాడ వెనుకబడి ఉన్న కారణంగానే స్మార్ట్ సిటీగా ఎంపిక కాలేదని వివరించారు.