: కేసీఆర్ ‘ఆస్థాన’ జ్యోతిష్యుడి మాటతోనే జగన్ లో విశ్వాసం రెట్టింపయ్యిందట!


ఏపీలో త్వరలో సీఎం పదవి చేపడతానని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. మూడేళ్లలో చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోతారని, ఆ తర్వాత తాను సీఎం అవుతానని, ప్రజల కష్టాలకు చెల్లుచీటి ఇస్తానని ఆయన ఇటీవల పలుమార్లు ప్రకటించారు. అయినా ఏపీలో సంపూర్ణ మెజారిటీ సాధించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం పదవి నుంచి దిగిపోతారని జగన్ కు చెప్పిందెవరు? జ్యోతిష్యాలపై అంతగా నమ్మకం లేని జగన్ మనసును మార్చేసిన ఆ జ్యోతిష్యుడెవరు? అన్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ నేటి సంచికలో 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. అసలు విషయంలోకి వస్తే... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి తీరుతుంది అని అప్పుడెప్పుడో జోస్యం చెప్పి పలువురి దృష్టిని ఆకర్షించిన రమణరావు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆస్థాన పండితుడిగా పేరుగాంచారు. 2009లో మహా కూటమితో బరిలోకి దిగిన టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య సీట్ల సర్దుబాటులోనూ రమణరావు కీలక భూమిక పోషించారు. ఇక దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని ఆయన ముందే ఊహించారట. ఈ క్రమంలో రమణరావును కొందరు వ్యక్తులు బలవంతంగా జగన్ వద్దకు తీసుకెళ్లారట. దాదాపు గంటపాటు జగన్ జాతకం, హస్త రేఖలు చూసిన రమణరావు 2017లో జగన్ కు ‘సీఎం యోగం’ ఉందని చెప్పారట. తన తండ్రి ప్రమాదాన్ని ముందే ఊహించడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ముందే చెప్పడం తదితర కారణాలతో రమణరావు జోస్యాన్ని జగన్ బాగానే నమ్మారు. ఈ క్రమంలోనే మూడేళ్లలో చంద్రబాబు పదవి దిగడం ఖాయమని, తాను సీఎం అవుతానని జగన్ ప్రకటించారని ఆ కథనం తెలిపింది.

  • Loading...

More Telugu News