: జనతా పరివార్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఒవైసీ ప్రకటన


తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాదులోని పాత బస్తీలో మంచి పట్టున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ రెండు సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆ స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపి అన్ని రాజకీయ పక్షాలకు ముచ్చెమటలు పట్టించింది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ దిగేందుకు ఆ పార్టీ సన్నాహాలు పూర్తి చేసుకుంది. ఈ మేరకు నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టమైన ప్రటకన చేసిన సంగతి తెలిసిందే. బీహార్ లోని సీమాంచల్ పరిధిలోని దాదాపు 40 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించుతామని ఆయన వెల్లడించారు. ఎంఐఎం బరిలోకి దిగడంపై ఇప్పటికే అక్కడ ముఖాముఖీ పోరుకు సిద్ధమైన బీజేపీ, జనతా పరివార్ లకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎంఐఎం పోటీ చేసినా తమకేమీ ఇబ్బంది లేదని బీజేపీ బయటకు ప్రకటించినా, ఏఏ ప్రాంతాల్లో ఎంఐఎం ప్రభావం ఉంటుందన్న విషయంపై ఆరా తీయడం మొదలెట్టింది. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా పరివార్ కు మాత్రం అసదుద్దీన్ ప్రకటన ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎంఐఎం పోటీ చేయనున్న సీమాంచల్ పరిధిలో జనతా పరివార్ కు మంచి పట్టుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కంటే కాస్తంత ముందున్న జనతా పరివార్ కు బొటాబొటి మెజారిటీ మాత్రమే వస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తమకు పట్టున్న సీమాంచల్ లో ఎంఐఎం పోటీ చేస్తే, తమ విజయావకాశాలపై పెను ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని పరివార్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News