: మృత్యుంజయుడు ఈ బాలుడు!
చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న వాటిల్లో బోరుబావులు అత్యంత ప్రమాదకరమైనవన్న సంగతి అందరికీ తెలిసిందే. బోరుబావిలో పడి ప్రాణాలు నిలుపుకున్న అతికొద్ది మంది చిన్నారుల్లో ఈ బుడతడు కూడా చేరిపోయాడు. యూపీలోని ఫిరోజాబాద్ సమీపంలో రెండేళ్ల కిషన్ తండ్రితో కలసి పొలానికి వెళ్లాడు. తండ్రి పొలం పనుల్లో నిమగ్నం కాగా, కిషన్ ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు మూతలేని బోరుబావిలో పడిపోయాడు. ఈ బోరు బావి లోతు సుమారు 100 అడుగులు. సమాచారం తెలుసుకున్న స్థానికులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన బాలుడిని వెలికితీసే చర్యలు చేపట్టారు. బాలుడు శుక్రవారం సాయంత్రం బావిలో పడగా, ఈ తెల్లవారుఝామున బయటకు తీశారు. బాలుడు ప్రాణాలతో ఉండటంతో అధికారులు, పోలీసులు పడ్డ శ్రమ ఫలించినట్లయింది. కిషన్ ను ఆసుపత్రికి తరలించగా, అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.