: అసలు నేతాజీ ఏమయ్యారు? 18న వెలుగులోకి వస్తున్న 64 సీక్రెట్ ఫైల్స్


నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితానికి సంబంధించి, ఇప్పటివరకూ రహస్యంగా ఉన్న 64 ఫైళ్లు, వచ్చే శుక్రవారం నాడు తొలిసారిగా బాహ్య ప్రపంచానికి కనిపించనున్నాయి. ఈ ఫైళ్లలో జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశాలేవీ లేవని, అందువల్ల వీటిని బహిర్గతం చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. నేతాజీ వారసులు ఈ ఫైళ్లను విడుదల చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫైళ్లను వెలుగులోకి తెస్తున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, కేంద్రంతో సంబంధం లేకుండానే దీన్ని తీసుకున్నామని ఆమె వివరించారు. నేతాజీ బెంగాల్ గడ్డపై నుంచి కార్యకలాపాలు సాగించారని గుర్తు చేశారు. కోల్ కతాలోని పోలీస్ మ్యూజియంలో ఈ ఫైళ్లను ప్రజల కోసం ఉంచుతామని తెలిపారు. ఈ ఫైళ్లను చూసిన తరువాత ఆయన అదృశ్యంపై ఉన్న ఊహాగానాలు తొలగిపోవచ్చని భావిస్తున్నట్టు నేతాజీ రీసెర్చ్ బ్యూరో చైర్ పర్సన్ కృష్ణా బోస్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ దస్త్రాలు విడుదలైతే, పలు దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు ఘోరంగా దెబ్బతింటాయని కేంద్ర సమాచార కమిషన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News