: తారక్... ఓసారి సత్తెనపల్లి రండి: లండన్ లో జూనియర్ ఎన్టీఆర్ కు కోడెల ఆహ్వానం
అదేంటీ, సత్తెనపల్లి రావాలని జూనియర్ ఎన్టీఆర్ (తారక్)ను ఆహ్వానించేందుకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ లండన్ వెళ్లాల్సి వచ్చిందా? అని ఆశ్చర్యపోకండి. లండన్ పర్యటనకు వెళ్లిన కోడెలను షూటింగ్ నిమిత్తం అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లి రావాలని కోడెల, తారక్ ను ఆహ్వానించారు. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. దీంతో కొన్ని రోజులుగా తారక్ అక్కడే ఉంటున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఓ సదస్సులో పాల్గొనేందుకు కోడెల, ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరికొంత మంది ప్రతినిధులతో కలిసి లండన్ కు వెళ్లారు. విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్... కోడెల, బొజ్జలను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో మరుగుదొడ్ల నిర్మాణం, శ్మశానాల ఏర్పాటు తదితరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రావాలని తారక్ ను కోడెల ఆహ్వానించారు. కోడెల ఆహ్వానాన్ని మన్నించిన జూనియర్ త్వరలోనే సత్తెనపల్లి వస్తానని చెప్పాడట.