: ‘నల్ల కలువ’ కల చెదిరింది.. సెమీస్ లో అన్ సీడెడ్ చేతిలో ఘోర పరాజయం


మరో రెండు మ్యాచ్ లు గెలిచి ఉంటే అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ చరిత్ర తిరగరాసేదే. అయితే, అనూహ్యంగా ఎదురైన అన్ సీడెడ్ క్రీడాకారిణి రోబెర్ట్ విన్సీ (ఇటలీ) చేతిలో సెమీస్ పోరులో చతికిలబడిన సెరెనా తన కలను కల్లలు చేసుకుంది. ఇప్పటికే ఈ కేలండర్ ఇయర్ లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన సెరెనా... యూఎస్ ఓపెన్ కూడా గెలిచి ఉంటే, ఒక కేలండర్ ఇయర్ లో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కేది. 27 ఏళ్లుగా సాధ్యం కాని ఫీట్ ను తన పేరిట నమోదు చేసుకునేదే. క్వార్టర్ ఫైనల్ లో తన సొంత అక్క వీనస్ విలియమ్స్ ను అలవోకగా చిత్తు చేసిన సెరెనా సెమీస్ లో మాత్రం విన్సీతో పోరాడినా ఫలితం రాబట్టలేకపోయింది. భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్ లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన విన్సీ 2-6, 6-4, 6-4 స్కోరుతో సెరెనాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో విజయంతో అసలు అంచనాలే లేకుండా దూసుకొచ్చిన విన్సీ నేరుగా ఫైనల్ చేరుకోగా, టైటిల్ ఖాయంగా చేజిక్కించుకుంటుందనుకున్న సెరెనా మాత్రం ఇంటిబాట పట్టింది.

  • Loading...

More Telugu News