: నా పర్యటన కోసం పాఠశాలలకు సెలవు ఇవ్వడం సరికాదు: మోదీ
ఛండీఘర్ లో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో అక్కడి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అంతేగాక భారీ స్థాయిలో భద్రత కూడా చేపట్టారు. దాంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఈ విషయం తెలిసిన మోదీ ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశారు. తన చండీఘర్ పర్యటన వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని చెప్పారు. తన పర్యటన కారణంగా 180కి పైగా పాఠశాలలకు సెలవు ఇచ్చి వాటిని మూయించడంపై ప్రధాని మండిపడ్డారు. అందుకు బాధ్యులను గుర్తిస్తామని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రధానమంత్రి ముందు తప్పుచేసి తరువాత క్షమాపణలు చెబుతారని, ఆయనకు ఇదో అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది.